11-11-2025 01:00:00 AM
దక్షిణ డిస్కం నిర్ణయం
ఉత్తర డిస్కంలో స్కాడా పనులపై డిప్యూటీ సీఎం భట్టి ఆరా!
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో సబ్‌స్టేషన్లు, బ్రేకర్ల వారీగా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తినా క్షణాల్లో దానిని గుర్తించి, పరిష్కరించి, ఆ సమస్యకు సంబంధించిన సమాచారాన్ని (డాటా)ను దాచిపెట్టడంతోపాటు విశ్లే షించడానికి ఉద్దేశించిన సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డాటా ఆక్విజిషన్ (స్కాడా) వ్యవస్థను ఏర్పా టు చేయడానికి రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఒక్కో రకంగా ముందుకు వెళుతున్నాయి.
ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)లో నిబంధనలను పక్కనపెట్టి మాన్యుఫాక్చ రింగ్ కంపెనీకి కాకుండా వైటల్ అనే ఒక కంపెనీకి ఇచ్చిన విషయాన్ని ‘విజయక్రాంతి’ వెలుగు లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 2న ‘ఉత్తర డిస్కంలో స్కాం’ శీర్షికన రూ.100 కోట్ల అక్రమ వడ్డింపులపై రాసిన కథనం విద్యుత్తు సంస్థల్లో చర్చనీయాంశమయ్యింది.
ఇదిలా ఉండగా.. దక్షిణ డిస్కం (ఎస్‌పీడీసీఎల్) పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్తు సబ్‌స్టేషన్లలోనూ స్కాడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కొద్ది కాలం క్రితం టెండర్లు పిలిచారు. అయితే మార్గదర్శకాలమేరకు ఒరిజినల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకే ఆ పనులను అప్పజెప్పినట్టు తెలుస్తుంది. నిజానికి ఉత్తర డిస్కంలో టెండర్లు దక్కించుకున్న కంపెనీ కూడా దక్షిణ డిస్కం పరిధిలో స్కాడా ఏర్పాటుకు సంబంధించి టెండర్లలో పాలుపంచుకున్నట్టు తెలుస్తుంది.
అయితే మార్గదర్శకాలకు విరుద్ధంగా స్కాడా పరికరాలు, సాంకే తికతను ఒరిజినల్‌గా ఉత్పత్తి చేయని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. తరువాత ఇబ్బందుల తలెత్తుతాయని భావించిన దక్షిణ డిస్కం యాజమాన్యం సదరు కంపెనీని పక్కనపెట్టి.. మల్టీ నేషనల్ కంపెనీ అయిన సీమెన్స్ కంపెనీకి, ఆ కంపెనీతో అనుసంధానం అయిన సంస్థకు ఈ టెండర్లను అప్పజెప్పినట్టు సమాచారం. దీనితో రెండు డిస్కం కంపెనీలు చెరో పద్ధతిలో స్కాడా సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయడంపై విద్యుత్తు ఉద్యోగుల్లోనూ చర్చ సాగుతోంది.
డిప్యూటీ సీఎం ఆరా
ఉత్తర డిస్కం పరిధిలో జరిగిన స్కాడా టెండర్లకు సంబంధించి స్కాం జరిగినట్టుగా వచ్చిన విజయక్రాంతి కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీసినట్టు సమాచారం. అలాగే దక్షిణ డిస్కం పరిధిలో ఇలాంటి స్కాడా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారా.. చేస్తే.. ఏ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం టెండర్లు కేటాయించారనేది ఉన్నతాధికారులను ఆరా తీసినట్టు తెలుస్తుంది.
ఈ సందర్బంగానే దక్షిణ డిస్కం పరిధిలోకూడా స్కాడా ఏర్పాటుకు టెండర్లు పిలిచారని, అయితే మార్గదర్శకాల ప్రకారం ఒరిజినల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీతో టైఅప్ అయిన సంస్థకే కేటాయిం చినట్టుకూడా అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టుగా సమాచారం. దీనితో ఒకే కంపెనీకి సంబంధించి, ఒకేరకమైన పనుల విష యంలో రెండు డిస్కంలు వేర్వేరుగా వ్యవహరించడంపై ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.
నిబంధ నలు, మార్గదర్శకాలు ఏవైనా.. రెండు డిస్కంల పరిధిలో ఒకేలా ఉంటాయని, అలాంటిది రెండు డిస్కంలు వేర్వేరుగా ఎలా పరిగణలోకి తీసుకుంటాయని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒక డిస్కం పరిధిలో ఒప్పు అయినది మరో డిస్కం పరిధిలో తప్పు ఎలా అవుతుందనేదానిపై లోతుగా పరిశీలిస్తే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎంతమేర స్కాం జరిగిందనేది తేటతెల్లం అవుతుందని విద్యుత్తు సంస్థల ఉద్యోగులు చర్చిం చుకుంటున్నారు.