10-09-2025 09:28:26 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): అర్హులైన గిరిజన కుటుంబాలకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలను(Welfare schemes) నేరుగా అందించడానికి మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం ప్రతిస్పందననాత్మక పాలనా కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది కర్మయోగి అభియాన్ పథకం సంబంధించిన కార్యక్రమాలు మండలంలోని నకిరిపేట, ఉప్పుసాక, కృష్ణ సాగర్ గ్రామాలలోని గిరిజనులకు మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ముందుగా గిరిజన గ్రామాలకు సందర్శించి గ్రామములో గ్రామ సభ ఏర్పాటుచేసి పథకాలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రత్యేకంగా ఒక బోర్డుపై వ్రాయించి, ప్రజలకు ముందుగా వారికి అర్థమయ్యే రీతిలో బోధన, ప్రజలు ఆలోచించేలా ప్రోత్సహించాలని సూచించారు.
గిరిజన గ్రామాలలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారము తప్పనిసరిగా మండల్ లెవెల్ కమిటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ముఖ్యంగా విద్యా, వైద్యం, అంగన్వాడి సెంటర్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా విడుదలయ్యే పథకాల గురించి అవగాహన కల్పించి వారు తీసుకునేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మరియు ఆది కర్మయోగి అభియాన్ పథకం మండల నోడల్ అధికారి జమలా రెడ్డి,నాగరాజు హెచ్ డబ్ల్యు ఓ నాగరాజు,హెచ్ఈవో బి. రవి,హెచ్ఎం ఉషారాణి,సిసి రాంబాబు,ఐసిడిఎస్ సూపర్వైజర్ జగదాంబ తదితరులు పాల్గొన్నారు.