10-09-2025 11:12:53 AM
న్యూఢిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బుధవారం నాడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే సమావేశం ముగిసింది. రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి సమావేశం సుమారు అరగంట పాటు జరిగింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు రాజ్ నాథ్ కు సీఎం తెలిపారు. గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తోందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నిన్న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తుచేశారు.