10-09-2025 10:59:29 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఊరగుట్ట నేచర్ పార్క్ ను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil) అన్నారు. ఇల్లందు మండలం సుభాష్ నగర్ లోని ఊరగుట్ట నేచర్ పార్క్( Uruguttu Nature Park) ను సందర్శించి, అక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి, నేచర్ పార్క్ అభివృద్ధి కి అవకాశాలు, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలను సంభంధిత శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఊరగుట్ట నేచర్ పార్క్ జిల్లాలో సహజసిద్ధమైన అద్భుత సౌందర్యాన్ని కలిగిన ప్రదేశమని, దీనిని సక్రమంగా అభివృద్ధి పరచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే అవకాశముందన్నారు. పార్క్ అభివృద్ధి ద్వారా పర్యాటక రంగంలో పురోగతితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయాన్నారు. ఊరగుట్ట నేచర్ పార్క్ లో ట్రెక్కింగ్ మార్గాలు, జిప్ లైన్, ఫ్లై ఏరియా, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి వినోదాత్మక వసతులు ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని
ఈ, సంబంధిత అధికారులను ఆదేశించారు. యువత, కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యేలా వినోదం, భద్రత, విశ్రాంతి అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్క్ లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించబడాలని తెలిపారు. పార్క్ లో ఏర్పాటయ్యే స్టాల్స్, ఫుడ్ కార్నర్స్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు వంటి వాటిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుందని, స్థానిక మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఊరగుట్ట నేచర్ పార్క్ ను జిల్లాలో పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యమని, దీనిద్వారా జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి కొత్త దారులు తెరవబడతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ రవి, ఎఫ్ డి ఓ కరుణాకర చారి, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాస్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరందామ రెడ్డి, ఏం పి డి ఓ ధన్సిగ్ మరియు సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.