16 April, 2026 | 2:23 AM

డీలిమిటేషన్‌పై కేసీఆర్ మౌనమేల?

16-04-2026 12:56 AM

మోదీకి భయపడి మాట్లాడటం లేదా? 

దక్షిణాదికి అన్యాయం జరిగితే మరో ఉద్యమం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరిక 

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు 2026 జనాభా లెక్కల ప్రకారం చేయకుండా ముందే హడావుడి ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు చట్టం తీసుకురావాల్సిన అవసరమేముందని నిలదీశారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన హైబ్రిడ్ ఫార్ములను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ మాత్రం సృహ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా ? తమ ఇష్టానుసారంగా చేస్తామంటే మద్దతు ఇ వ్వాలా? అని  నిలదీశారు. గతంలో వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిం దని, భవిష్యత్‌లో మరో ఉద్యమం వచ్చేలా ఉందన్నారు.

దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే బీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గతంలో దేశ్‌కి నేతగా చెప్పుకున్న కేసీఆర్, ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మోదీకి భయపడి మాట్లాడటం లేదా? బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న భావన కలుగుతుందా? అని ఆయన విమర్శించారు. పునర్విభజనపై బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు తమ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే మహిళా బిల్లును నియోజక వర్గాల పునర్విభజనతో కలుపుతున్నారని మండిపడ్డారు. యూపీఏ హయాం లోనే రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిందన్నారు.