4 April, 2026 | 11:45 PM

చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా

04-04-2026 09:12 PM

1127 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం

– ప్రముఖుల ప్రసంగాలు ఆకట్టుకున్న వేడుక

గౌరవ అతిథి, మాజీ మంత్రి ఏనుగాల పెద్ది రెడ్డి

యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్.వి. పురుషోత్తం రెడ్డి

మొయినాబాద్ ఏప్రిల్ 04 (విజయ క్రాంతి): మొయినాబాద్ సమీపంలోని చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)లో 14వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1991లో డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన ఈ సంస్థ 2019లో డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెంది 35 సంవత్సరాల విద్యా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ అతిథులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో డిగ్రీలు, పీజీ, బీటెక్, బీఫార్మసీ, పీహెచ్‌డీ కోర్సులకు చెందిన 1127 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రామానుజ్ నారాయణ్, డైరెక్టర్, సిఎస్ఐఆర్–ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఒడిశా), విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య సమాజ అభివృద్ధికి కీలక సాధనమని పేర్కొన్నారు. పరిశోధన, సాంకేతికతల అభివృద్ధిలో చైతన్య యూనివర్సిటీ పాత్రను ప్రశంసించారు. గౌరవ అతిథి, మాజీ మంత్రి ఏనుగాల పెద్ది రెడ్డి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. చదువు అనేది మన జీవితం లో జర్నీ లాంటిది అనే సూత్రాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు. కష్టపడి పనిచేయడం, నమ్మకం, పట్టుదల విజయానికి మూలమని పేర్కొన్నారు.

డాక్టర్ టి. పవన్ కుమార్, శాస్త్రవేత్త విద్యార్థులు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ, ఆర్థిక, మేధోపరమైన అభివృద్ధిని సమతుల్యం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ దృక్పథంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్.వి. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి విద్యను అందించడంలో యూనివర్సిటీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భవిష్యత్ నాయకులను, ఆవిష్కర్తలను తయారు చేయడంలో సంస్థ పాత్రను వివరించారు. పట్టభద్రులు పట్టుదల, నిజాయితీతో కెరీర్‌లో ముందుకు సాగాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.పట్టాల ప్రదానం అనంతరం విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకకు మరింత ఆకర్షణగా నిలిచాయి.