ధాన్యం రైతుకు తిప్పలు!
కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు కరువు
కాంటాలలో తేడాలతో మోసపోతున్న రైతులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు.
బస్తాకు కేజీ పైనే అదనపు తూకం
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత రైతులు
తుంగతుర్తి, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే వాటిలో అరకొర వసతులతో కేంద్రంలో నిర్వాహకులు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కాంటాలలో తేడాలు: జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో నిర్వాహకురాలు ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి, రైతుల ఒడ్లు పూర్తిస్థాయిలో ఎండబెట్టకుండా, ముందు కళ్ళములో పోసిన వడ్లను వదిలిపెట్టి, వెనుక వచ్చిన ధాన్యము ను శుభ్రంగా లేకున్నా కాంటాలు పెడుతున్నారంటూ పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. శుభ్రం చేయని దాన్యమును లారీలలో ఎగుమతి చేయడంతో, మిల్లులో దిగుమతి అయిన తర్వాత, కాంటాలో తేడాలు వచ్చి, రెండు నుండి మూడు క్వింటాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసపోతున్న రైతులు:
ఐకెపి సెంటర్లో ఒక బస్తాకు 41 కేజీల 200 గ్రాములు, తూకం పెట్టవలసి ఉండగా, అలాకాకుండా కొందరి రైతుల ఇష్టం మేరకే ఒక బస్తాలో 42 కేజీల 200 తూకం పెట్టినట్లు నిర్వాహకురాలు ఒప్పుకున్నారు. ప్రస్తు త సీజన్లో 41 కేజీలకే బస్తా పూర్తిగా నిండి, ఒడ్లు బయటపడుతున్నాయి. బయటపడ్డా వడ్లను అదే లారీలో పోయకపోవడంతో తూకంలో తేడా వచ్చి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనితో కొంతమంది రైతులు నిర్వాహకుల మధ్య లొల్లి జరిగింది. జరిగిన సంఘటన పట్ల రెవెన్యూ అధికారులు వచ్చి విచారణ చేపట్టారు. కోడూరు ఐకెపి కేంద్రంలో నిర్వాహకురాలు చేస్తున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రైతులకు నష్టం కలగకుండా న్యాయం చేయాలని, బాధిత రైతులు కోరుతున్నారు.
విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటాం
కొనుగోలు కేంద్రానికి వచ్చిన దాన్యం పూర్తిస్థాయిలో ఎండిన తర్వాత, కావాల్సిన మ్యాచర్ వస్తేనే కాంటాలు పెడతాం. దీనికి విరుద్ధంగా పనిచేసిన నిర్వాహకులపై ఉన్నతాధికారులకు తెలియపరచి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
రాంబాబు, ఏపీఎం, తుంగతుర్తి
కొనుగోలు కేంద్రంలో ఇష్టారాజ్యంగా కాంటా పెడుతున్నారు
ప్రభుత్వం నియమ నిబంధన ప్రకారం కొనుగోలు కేంద్రానికి మొదట ధాన్యం తీసుకొచ్చిన రైతు పేరును నమోదు చేసుకొని, వడ్లు పట్టిన అనంతరం, తేమ శాతాన్ని చూసి, అనంతరం కాంటా పెట్టవలసి ఉండగా, ఇస్తారాజ్యంతో నిర్వాహకురాలు పనులు నిర్వర్తిస్తుందని, తక్షణమే ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
బిక్కీ సైదులు, రైతు, కోడూరు






