29 April, 2026 | 3:26 AM

నిందితులకు శిక్షలు పడేలా కఠిన చర్యలు

29-04-2026 12:50 AM

* జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల,ఏప్రిల్ 28,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్ కేసులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.పెండింగ్లో ఉన్న పాత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా పనిచేయాలని సూచించారు.

కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.దొంగతనం కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికత వినియోగం పెంచి రికవరీ శాతం మెరుగుపరచాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల రక్షణ, డ్రగ్స్ నిరోధంపై విస్తృత ప్రచారం చేపట్టాలని, గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచి, రౌడీషీటర్లను తనిఖీ చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీలు నాగేంద్రచారి,శ్రీనివాసులు, సి.ఐలు,ఆర్ .ఐలు, ఎస్.ఐలు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.