25 April, 2026 | 6:51 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

25-04-2026 05:41 PM

దమ్మపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో రైతులు కష్ట పడి పండించి వరి కోతలు పూర్తి అయినా నెల రోజులుగా కాంటాలు మొదలు పెట్టకావడంతో ధాన్యం ప్రభుత్వ కొనుగోలు యార్డులలో మగ్గుతూ ఉండటం, ప్రభుత్వం, సంబధిత అధికారులు నుంచి కనీస స్పందన, స్పష్టమైన ప్రకటన లేకపోవటం పై మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, దమ్మపేట సొసైటీ మాజీ చైర్మన్, బిఆరెస్ జిల్లా నాయకులు రావు జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బిఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్ట కాలంలో కూడా ధాన్యం కొనుగోళ్లు ఆపలేదని, ప్రజా ప్రతినిధుల జీతాలను ఆపి రైతులకు చెల్లించిన ఘనత ఆనాడు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి ఉంటే, నేడు రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారని , రుణ మాఫీ పూర్తి చేయకుండా , యూరియా కోసం ముప్పు తిప్పలు పెట్టి, కరెంట్ కోతలు విధిస్తూ తీరా అన్నింటిని తట్టుకొని పంటలు పండించినా కొనే దిక్కు లేదన్నారు.

కొనుగోళ్లు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యాన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి యార్డులకు తరలిస్తే నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదనీ, అకాల వర్షాలకు భయపడి రైతు ప్రతి రోజూ ఆకాశం వైపు చూసే పరిస్థితి నెలకొని ఉందన్నారు. కూల్చటాలు, కాంట్రాక్టుల పైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలులో లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాలు మొదలు పెట్టకపోతే రైతులతో కలసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని , రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి బోనస్ కూడా చెల్లించే వరకు వారికి బిఆరెస్ పార్టీ తరుపున అండగా నిలబడతామని తెలియజేశారు. ఈ ప్రభుత్వం పై రైతులకు నమ్మకం పోయిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి రైతు ప్రభుత్వమైన బిఆరెస్ పార్టీని తెచ్చుకోవడానికి సిద్ధంగా రైతులు ఉన్నారని అన్నారు .