17 August, 2026 | 4:48 PM

ప్రజావాణికి అధికారుల డుమ్మా.. ప్రజల్లో నమ్మకం ఏది?

17-08-2026 03:14 PM

సమయం ముగియకముందే సగం మంది అధికారులు వెళ్లిపోయిన వైనం..

41 గ్రామపంచాయతీలో వచ్చింది తొమ్మిది దరఖాస్తులు...

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు పరిష్కారంపై భరోసా కరువు?

కారేపల్లి ఆగస్టు 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణికి కొంతమంది అధికారులు గైర్హాజరు కాగా, మరికొందరు సమయపాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా 10 గంటల సమయం నుంచి 12 గంటల వరకు వస్తూ ఉండగా మరికొందరు నిర్ణీత సమయం ముగియకముందే వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.

మండల కేంద్రంలో పలు సమస్యలు నెలకొన్నప్పటికీ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. అయితే అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం, సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ప్రజల్లో ప్రజావాణిపై నమ్మకం సన్నగిల్లుతోందనీ దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నేటి ప్రజావాణికి 9 దరఖాస్తులు రావడమే సూచికగా  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజావాణి కేవలం ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమంగా కాకుండా, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా మారాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం వాటిపై తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, కార్యక్రమం ముగిసే వరకు అధికారులు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.