9 May, 2026 | 8:15 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

09-05-2026 12:00 AM

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ జోగిపేట మార్కెట్ యార్డుతో పాటు చౌటుకూరు మండలం కొర్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీలు, లారీలు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రైతుల ఖాతాల్లో జమ చేసిన చెల్లింపుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన మేరకు హమాలీలు, లారీలు సమకూర్చాలని ఆదేశించారు.అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 233 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం అంబదాస్, డీఆర్డీవో పీడీ జ్యోతి, డీసీఓ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ ప్రసాద్, తహసీల్దారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.