18 April, 2026 | 1:59 AM

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

18-04-2026 12:28 AM

బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆవేదన

బూర్గంపాడు,ఏప్రిల్ 17 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో యార్డు వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో గత నెలరోజులుగా ముమ్మరంగా వరికోతలు జరుగుతున్నాయని, కోసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మార్కెట్ యార్డులోనో, రోడ్ల పక్కనో, రైతుల కల్లాల్లోనో ఆరబెట్టుకుని కోనుగోళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అకాల వర్షాల సంభవిస్తే ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలయ్యే అవకాశం ఉందని...ఈ క్రమంలో పగలనకా...రాత్రనకా పంటను కాపాడుకోవాల్సి వస్తుందని అన్నదాతలు తమ ఆక్రందన వ్యక్తం చేశారు.

ఇది అదునుగా భావిస్తున్న దళారులు పండించిన పంటకు సరైన మద్ధతు ధర చెల్లించకుండా పలు కారణాలతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రోజుల తరబడి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు కేవీ రమణ ఉన్నారు.