15 May, 2026 | 4:05 PM

ధాన్యం కొనుగోల్ మరింత లేట్

23-04-2024 01:40 AM

సేకరణకు అకాల వర్షాలు.. వడగండ్ల గండం

ఆందోళనలో రైతులు.. 

దిగుబడిని కాపాడుకునేందుకు పాట్లు

‘పెద్దపల్లి’లో 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం

ఇప్పటివరకు కొనుగోలు చేసింది 10 వేల టన్నులే.. 

పెద్దపల్లి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వారం నుంచి కారుమబ్బులు కమ్ముతున్నాయి. అడపా దడపా వడగండ్లు పడుతు న్నాయి. చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీళ్ల పాలవుతున్నది.. దీంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. చేతికందిన పంటను తొందరగా విక్రయిస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నది.

సేకరణ ఇలా..

జిల్లా నుంచి ఈసారి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 1 నుంచి 131 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వాటి పరిధిలో అధికారులు ఇప్పటివరకు 1,200 మంది రైతులు పండించిన రూ.23.50 కోట్ల విలువైన 10,696 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. సేకరించిన ధాన్యంలో సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇప్పటివరకు కేవలం 300 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే ధాన్యం విక్రయానికి సంబంధించిన రూ.41 లక్షల సొమ్ము జమ అయింది. మిగతా వారు ఎప్పుడు సొమ్ము జమ అవుతుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడే పంట చేతికొచ్చిన రైతులు కల్లాల్లో ఇప్పుడు కల్లాల్లో ఆరబెడుతున్నారు. అధికారులు ధాన్యంలో 17శాతం లోపు తమే ఉంటేనే కొనుగోలు చేస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం నుంచి వాతావరణం చల్లబడి మబ్బులు పడుతుండడంతో అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. మరోవైపు వానల నేపథ్యంలో మిల్లర్లూ ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు 10శాత మైనా చేరుకోలేదు. ఈ చొప్పున లక్ష్యాన్ని అధిగమించాలంటే ఇంకెంత సమయం పడుతుందోననే ప్రశ్న తలెత్తుతున్నది.

17 శాతం లోపు తేమ ఉండాలి..

పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా వారం నుంచి కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండాలి. లేదంటే మిల్లర్లు ధాన్యం తీసుకొవడంలేదు. ఈసారి ధాన్యంలో తరుగు పేరుతో కోత పెట్టడం లేదు. రైతులు నిశ్చింతగా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి విక్రయించవచ్చు.

  శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్, పెద్దపల్లి