మహిళలను కించపర్చే వ్యాఖ్యలు తగవు
l ప్రధాని మోదీకి వీహెచ్ హితవు
హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): దేశ సంపదను, మహిళల తాలిబొట్టును ముస్లింలకు పంచాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన వాఖ్యలను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. పదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేశారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. బీజేపీకి ముస్లింల ఓట్లు పడవనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టే విధంగా మోదీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ ఎప్పుడూ పేదల కోసం మాట్లాడలేదన్నారు. రాముడి గుడితో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కులగణన కోసం ఎన్నడూ మాట్లాడలేదని, రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించలేదని విమర్శించారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌పైన మోదీ విమర్శలు చేయడం సరికాదన్నారు. మణిపూర్‌లో మారణహోమం జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు. తెలంగాణలో బీజేపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






