10-11-2025 10:48:29 PM
నాంపల్లి మండల తహసిల్దార్ దేవసింగ్..
చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని నాంపల్లి మండల తహసిల్దార్ దేవసింగ్ అన్నారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం(ఉప్పరిగూడ) గ్రామంలో నాంపల్లి మండల తహసిల్దార్ దేవసింగ్, హకా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జి డాక్టర్ గాలెంక ఇందిరతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కల్లాలోనే వరి ధాన్యం ఆరబెట్టుకొని పేల్లలు తాలులు లేకుండా ధాన్యాన్ని సెంటర్ కు తీసుకురావాలని అన్నారు.
ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతోపాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చి వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల వ్యవసాయ అధికారి బండారు శివ, మానిటరింగ్ ఆఫీసర్ కోటేష్, లారీ యూనియన్ అసోసియేషన్ రాజలింగం, ఏ జీవో జగన్, డాక్టర్ విజయ్ కుమార్, బుచపమ్మ, వెంకటమ్మ, వసంత, వసుమతి,సిబ్బంది, రైతులు ఉన్నారు.