16 May, 2026 | 2:48 AM

ధాన్యం తరలింపు వేగవంతం చేయాలి

16-05-2026 01:17 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, మే 15(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు త్వరగా దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. హమాలీలు, లారీల ఏర్పాటు చేయలన్నారు. ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్యను పెంచుకుని లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ధాన్యం నిల్వకు, రక్షణకు అవసరమైన గన్ని బ్యాగులను, టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు.ధాన్యం తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో పూర్తిగా పారదర్శకత పాటించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి, ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.