విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ మే 15 (విజయ క్రాంతి) : విద్యపై ప్రతిక దృష్టి పెట్టి భవిష్యత్తును ఇప్పటినుంచే నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మాల మమతతో కలిసి ఎస్‌ఎస్సీ లో ముగ్గురు ఇంటర్ లో ముగ్గురు, క్రీడలలో ముగ్గురు ఉత్తమ ఫలితాలు సాధించిన 9 మంది జిల్లా టాపర్లకు రూ 10 వేల నగదు, మెడల్, సర్టిఫికెట్ ప్రధానం చేసి సన్మానించారు.
జిల్లా లో ఎస్.ఎస్.సి ఫలితాల్లో 100 శాతం పాస్ సాధించిన 57 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శాలువాతో సన్మానించి, ఆయా పాఠశాలలో యస్.యస్.సి లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్, సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సమష్టి కృషితో జిల్లాలో ఎస్‌ఎస్సీ ఫలితాల్లో 92.70 శాతం ఉత్తీర్ణత సాధించ గలిగామని అన్నారు. జిల్లాలో ఉన్న 180 ప్రభుత్వ విద్యాలయాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, నూటికి నూరు శాతం ఫలితాలు నమోదు చేసిన 57 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకే ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్,ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రాజశేఖర్ రెడ్డి, సి.యం.ఓ సుధాకర్ రెడ్డి, ఎ.ఎం.ఓ డి . శ్రీనివాస్, జి.సి.డి.ఓ ఆశ్ర ఖాద్రి, ఎడి అనురాధ,వెంకట్రాములు అన్ని మండలాల ఎంఈఓ లు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.






