గ్రామకంఠం భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వాలి
సీపీఎం నాయకులు ఆర్డీవోకు వినతి
ఇబ్రహీంపట్నం, జూలై ౨౦ (విజయక్రాంతి): దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన 4 ఎకరాల గ్రామకంఠ భూమిని స్వాధీనం చేసుకుని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డికి పార్టీ బృందంతో కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజాం కాలం నాటి భూస్వామి తంగడపల్లి అనంతరెడ్డి గెస్ట్ హౌస్ పరిసరాల్లోని 4 ఎకరాల గ్రామకంఠ భూమి ప్రస్తుతం మాజీ సర్పంచ్ తాడూరు జనార్దన్ రెడ్డి ఆక్రమణలో ఉంది.
2007లోనే ప్రభుత్వం దాదాపు 200 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇప్పటికీ స్థలాలు చూపించలేదు.ఆక్రమిత భూమిని విడిపించి, 2007 పట్టాదారులతో పాటు గ్రామంలోని ఇతర అర్హులైన పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీపీఎం నాయకులు సామెల్, బుగ్గరాములు, చాతళ్ల జంగయ్య, గుడేటి జంగయ్య, యాదగిరి, కాకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






