11 August, 2026 | 1:50 AM

ఘనంగా బోనాల సంబురాలు

11-08-2026 12:16 AM

డప్పు సప్పులు, పోతరాజుల విన్యాసాలు

జవహర్‌నగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): జవహర్నగర్, చంద్రపురి కాలనీ డివిజన్-2 పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కాలనీవాసులు అందరూ ఉత్సాహంగా పాలుపంచుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.

ఈ వేడుకల్లో భాగంగా కాలనీ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో, తలపై బోనాలతో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో కాలనీ వ్యవస్థాపకుడు మంద లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బుడిద వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సి. శ్రీకాంత్ మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాల తో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాస బోనాలు మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన పండుగని, ఇలాంటి వేడుకలు కాలనీవాసులందరిలో ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు: ఎం. లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రెటరీ కుమ్మరి కృష్ణ, కోశాధికారి కత్తర్ల కిరణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్: మూకర రవి, రంగుల హరికృష్ణ,ఉపాధ్యక్షులు: రంగుల శంకర్,ఆర్గనైజింగ్ సెక్రటరీలు: కోటగిరి.సంతోష్ కుమార్ కార్యదర్శులు: గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్,సహాయ కార్యదర్శులు:కెమ్మసరం సుజాత, టి. సుజాత, సుమతి,గౌరవ సలహాదారులు: సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్,కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బస్వరాజు, ఎం. వంశీ, వై. మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ. నాగచారి, ఆర్. చిత్తారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.