ఘనంగా వన మహోత్సవం
ముకరంపుర, జూలై 28(విజయ క్రాంతి) కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని 53వ డివిజన్ సాయి నగర్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. నగరాన్ని కేవలం క్లీన్ సిటీ గానే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నగర మేయర్ తెలిపారు.వన మహోత్సవం ప్రారంభోత్సవంలో భాగంగా సాయి నగర్లో ఒకే రోజు సుమారు 500 మొక్కలను నాటారు.
నగరవ్యాప్తంగా ప్రతి ఇంటికి రెండు చొప్పున పూల లేదా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని గృహాలకు 3 లక్షల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు, వివిధ డివిజన్లలో సుమారు లక్ష మొక్కలను నాటే లక్ష్యాన్ని నగరపాలక సంస్థ నిర్దేశించుకుంది.నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ, కరీంనగర్ను ’క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ గా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థకు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేత రమన్, వంగల పవన్ కుమార్, కాలనీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు,మహిళలు స్థానికులు మరియు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






