29 July, 2026 | 12:49 AM

ఖమ్మం నగరాభివృద్ధికి మంత్రి‘తుమ్మల’కృషి

29-07-2026 12:00 AM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి

ఖమ్మం దాహార్తి తీర్చేందుకు రూ.200 కోట్లు 

వరద గండం నుంచి విముక్తికి రూ.250 కోట్లు

రెండు కీలక పథకాలపై మంత్రి తుమ్మల క్షేత్రస్థాయి సమీక్ష

ఖమ్మం, జూలై 28 (విజయక్రాంతి): ఖమ్మం నగరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. అనేక రకాలుగా, అనేక పథకాలను అమలు చేస్తూ ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 

9 కి.మీ మేర 475 మ్యాన్ హోల్స్ - 7 డివిజన్లకు అనుసంధానం

ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) పరిధిలోని 1.80 లక్షల ఇళ్లకు వరద ముప్పు తప్పించేందుకు రూ.87 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఖానాపురం నుం చి ధ్వంసలాపురం చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర 475 మ్యాన్ హోల్స్తో 7 డివిజన్లను కలుపుతూ నిర్మాణం సాగుతోంది. అయితే పుట్టకోట వద్ద 9.5 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేం ద్రం ఆలస్యంపై స్థానికులు అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు. నెల రోజుల్లో పనులు పూర్తిచేసి యూడీజీని ప్రారంభిస్తామని అధికా రులు తెలిపారు.

వరద ముంపు, చెరువుల కాలుష్యానికి చెక్..

ఖమ్మం నగరాన్ని వరద గండం నుంచి కాపాడటంతో పాటు, చెరువులు మురుగునీటితో కలుషితం కాకుండా అండర్ గ్రౌండ్ డ్రై నేజీ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖానాపురం చెరువు నుంచి ధాంసలాపురం చెరువు వర కు మున్సిపల్ డ్రెయిన్ల ద్వారా వచ్చే మురుగునీరు వరద కాలువల్లో కలిసి చెరువులను కలుషితం చేస్తుండటంతో ధాంసలాపురం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారంగా అన్ని డ్రెయిన్లను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానించి మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తామని చెప్పారు.

శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించుకోగా, మిగిలిన నీరు మాత్రమే చెరువుల్లోకి చేరుతుందని వివరించారు. గత సంవత్సరాల్లో ఖానాపు రం చెరువు అలుగు వరద పోటెత్తడంతో పలు డివిజన్లు ముంపునకు గురయ్యాయని గుర్తుచేసిన మంత్రి, వర్షపు నీటిని తరలించేందుకు రూ.250 కోట్లతో వరద కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. వాకర్స్ ఆరోగ్యం, ఆహ్లాదం కోసం రెండు లకారం చెరువుల మధ్య నాలా సుందరీకరణ పనులను త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.

తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం

ఖమ్మం నగరవాసులకు తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. కృష్ణా నది నీరు అందని పక్షంలో గోదావరి జలాలను నాగార్జునసాగర్ కెనాల్కు మళ్లించి సమస్యను పరిష్కరిస్తామని, ఇప్పటికే గోదావరి జలాలను మున్నేరు వరకు తరలించినట్లు తెలిపారు.

రూ.200 కోట్లతో యూఐడీఎఫ్ పథకం - నిధుల..

ఖమ్మం నగరంలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ.200 కో ట్లతో యూఐడీఎఫ్ పథకం కింద తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న పనుల వివరాలు ఆయన ఏకరువు పెట్టారు: 25 మిలియన్ లీటర్ల సామ ర్థ్యం గల తాగునీటి శుద్ధి ప్లాంటు, 24 కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం,100 కిలోమీటర్ల మేర కొత్త పైప్లైన్ల ఏర్పాటు, 23,000 కొత్త నల్లా కనెక్షన్లు,నగరంలోని 4 జోన్లలో 24 గంటలూ తాగునీటి సరఫరా,పూర్తి ఆటోమేషన్ విధానంలో రక్షిత తాగునీటి పంపిణీ, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీర నుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

ఖమ్మం నగరాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాగునీటి పథకం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయడంలో సీఎం చూపిన చొరవను మంత్రి కొనియాడారు. నగర ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు, వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.