మే 1న శ్రీ బాలనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ బాలనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం (జాతర) ఈ నెల 30 నుండి తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఏప్రిల్ 30 గురువారం మే 1 శుక్రవారం తేదీలలో ఈ వేడుకలు నిర్వహించబడతాయి.ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం స్థానిక శివాలయం నుండి ఉత్సవ మూర్తుల ఊరేగింపుతో జాతర ప్రారంభమవుతుంది. మే 01 శుక్రవారం ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనం, మంటపారాధన,ఉత్సవమూర్తులకు అభిషేకం. ఉదయం 11:15 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా సంతాన ప్రాప్తి కోసం భక్తులకు "గరుడ ముద్ద" ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలను నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొననున్నారు.






