calender_icon.png 23 January, 2026 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు ఐఏఎస్ హోదా?

23-01-2026 01:13:47 AM

  1. కాంగ్రెస్ పరిపాలనలో.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత 
  2. కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా యూపీఎస్‌సీకి ఫిర్యాదు

నిబంధనలు బేఖాతర్

2022-24 సంవత్సరాలకు 16 మందికి ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు

  1. రిటైర్మెంట్‌కు ఆరు నెలల ముందు ఐఏఎస్ కన్‌ఫర్మ్
  2. సీనియారిటీ లిస్టు సిద్ధం చేయకుండానే కేంద్రానికి జాబితా
  3. ఏసీబీ, విజిలెన్స్, ఈడీ కేసుల్లో ఉన్నవారికీ ఐఏఎస్ హోదా
  4. అనర్హులకు తాజాగా ఐఏఎస్ కన్ఫర్మేషన్ ఇచ్చారంటూ ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వమని చెప్పుకునే కాం గ్రెస్ పార్టీ పరిపాలనలో ఎవరు ఎంత చేసుకుంటే.. అంత అన్న చందంగా పరిస్థితులు కనపడుతున్నాయి. తాజాగా 16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇలా ఐఏఎస్ కన్‌ఫర్మ్ అయి న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని, అయినా.. ఇటు రాష్ట్ర స్థాయిలో పెద్దల ఆశీస్సులు అందుకుంటూ.. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అనర్హులకు ఐఏఎస్ హోదా ఇచ్చారంటూ.. అటు రెవెన్యూ శాఖ అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంకావడం గమనార్హం.

అనర్హతలు ఇలా..

* గతంలో రిటైర్డ్‌మెంట్ (60 ఏండ్లు)కు 5 ఏండ్ల కన్నా ముందు ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేయరాదనే నిబంధన ఉండేది. తరువాత దానిని మూడేండ్లకు తగ్గించారు. అయితే తాజాగా ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేసిన జాబితాలో ఇద్దరు అధికారుల పుట్టిన సంవత్సరం 1966 జూన్‌గా ఉంది. అంటే మరో ఆరు నెలల్లో వారు రిటైర్డ్ అవుతారు. మరి వారికి ఎలా వచ్చిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

* ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే తాజాగా కన్‌ఫర్మ్ చేసిన జాబితాలో ఒక అధికారి.. గతంలో ఒక మంత్రి వద్ద పనిచేశాడని, ఆయనపై ఈడీ కేసు నమోద య్యి, విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఆయనకు ఎలా ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేశారనేది కేంద్ర డీవోపీటీ అధికారులకే తెలియాలి.

అయితే ఇందులో ‘రెడ్డి’ ఫార్ములా ప్రయోగించారని, అందుకే రాష్ట్రం నుంచి ఆయన పేరు ఢిల్లీకి వెళ్లిందని, అక్కడ కూడా మేనేజ్ చేయడంతో కేసుల విషయాలను పట్టించు కోకుండా ఐఏఎస్ కన్‌ఫర్మ్ అయ్యిందనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. పైగా తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఒక అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాస్తవానికి ఆ అధికారి పేరు కూడా ఈ జాబితాలో ఉండేందుకు ప్రయత్నించారని.. అయితే ఏబీసీ కేసు ఉండటంతో.. ఆయన పేరును పక్కనపెట్టారని చర్చ జరుగుతోంది. మరి అలాంటప్పుడు ఈడీ కేసు ఉన్న అధికారికి ఐఏఎస్ కన్‌ఫర్మ్ ఎలా చేస్తారంటూ రెవెన్యూ అధికారులే ప్రశ్నిస్తున్నారు.

* వాస్తవానికి ప్రతియేటా ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేయాలంటే.. సీనియారిటీ లిస్ట్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫైల్ చేయాలి. వాటికి క్లారిఫి కేషన్ తీసుకోవాలి. కానీ ఈ సందర్భంలో మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలే దు. జాబితా తయారు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా త్రం కేంద్రానికి అధికారుల జాబితా వెళ్లింది. వారికే గుడ్డిగా ఐఏఎస్ కన్‌ఫర్మ్‌చేస్తూ.. ఉత్తర్వులు వెలువ డ్డాయి. అంటే తెరవెనుక మతలబు ఏం జరిగి ఉంటుందో ఊహించు కోవచ్చు. 

* వాస్తవానికి 1995లో గ్రూప్ 2ఏ కింద (ఏపీపీఎస్‌సీ) డిప్యూటీ తాసీల్దారులు (నాన్ గెజిటెడ్)గా కొందరు ఉద్యోగంలో చేరారు. నిబంధనల ప్రకారం గ్రూప్- 2ఏ క్యాడర్ అధికారులకు ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేయకూడదు. కానీ ప్రస్తుతం ఐఏఎస్ కన్‌ఫర్మ్ అయినవారిలో పలువురు అధికారులు గ్రూప్-2ఏ అధికారు లే ఉన్నారు. ఇదెలా సాధ్యం. 

* తెలంగాణ ఏర్పడిన తరువాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనందున గతంలో గ్రూప్-2ఏ అధికారులుగా జాయిన్ అయిన వారికి ఐఏఎస్ కన్‌ఫర్మేషన్ కోసం పంపించామని కొందరు సీనియర్ అధికారులు అనడాన్ని రెవెన్యూ అధికారులు ఎత్తిచూపుతున్నారు. 

* పలువురు అనర్హులకు, నిబంధనలను పక్కనపెట్టి, లోపాయికారీగా ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేశారంటూ మనీష్‌తివారీ అనే సుప్రీంకోర్టు న్యాయవాది తాజాగా యూపీఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. డిప్యూటీ కలెక్టర్‌గా ఏ తేదీన జాయిన్ అయ్యారనేది పట్టించుకోకుండా ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేశారు. ఉదాహరణగా.. ఒక అధికారి 15.2.2017 నాడు అడ్‌హాక్ పద్ధతిలో డిప్యూటీ కలెక్టర్‌గా జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఐఏఎస్ కన్‌ఫర్మ్ కోసం సదరు అధికారి జాయినింగ్ తేదీని 1.8.2014 గా చూపెట్టారు. అలాగే మరో అధికారి డిప్యూటీ కలెక్టర్‌గా 12.7.2016 నాడు జాయిన్ అయితే.. 2.6.2014గా చూపెట్టారంటూ న్యాయవాది చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

* పైగా 2014 నుంచి డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాలను తయారు చేయలేదని, ఈ విషయంలో అనేక వివాదాలపై హైకోర్టులోనూ కేసులున్నాయని న్యాయవాది ఫిర్యాదు చేశారు.

* సీసీఎల్‌ఏ మెమో నెం.సీసీఎల్‌ఏ-ఎస్‌ఈఆర్/డీసీఎస్‌ఎం/04/2024, తేది 6.11.2025 ప్రకారం.. డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్ ప్యానళ్లను తయారుచేస్తున్నామని, సీనియారిని జాబితా సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు. కానీ ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేస్తూ.. జాబితా వచ్చేసింది. మతలబు ఏమిటి?

* వీటన్నింటిపైనా విచారణ చేయాలని, కన్‌ఫర్మ్‌చేసిన అధికారుల జన్మతేదీ, అపాయింట్‌మెంట్ తేదీ, డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి చెందిన తేదీ, సీనియారిటీ జాబితాలను పరిశీలించాలని సదరు న్యాయవాది ఫిర్యాదు చేశారు.

రాష్ట్రం, కేంద్రం స్థాయిలో ఏదో మతలబు?

16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడంపై అనేక ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో.. అసలు రాష్ట్రం ఎలా జాబితా పంపించింది? కేంద్రం ఎలా ఆమోదించిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ వీటన్నింటి వెనుక.. ఇటు రాష్ట్ర స్థాయిలో అటు ఢిల్లీ స్థాయిలోనూ ఏదో మతలబు జరిగి ఉంటుందనే అనుమానాలు మాత్రం బలంగా వినపడుతున్నాయి. వీటన్నింటికీ కేంద్రంలోని డీవోపీటీ సమాధానం చెప్పాలి.

రాష్ట్రం నుంచి సీనియారిటీ జాబితా రూపొందించి.. జాబితాను కేంద్రానికి పంపించారా.. సమాచారమంతా సరిచూసుకున్న తరువాతనే కేంద్రం ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేసిందా.. లేదా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ప్రజాప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం.. చేసుకున్నంత వారికి చేసుకున్నంత అనే చర్చ మాత్రం హాట్‌హాట్‌గా అధికారుల్లో జరుగుతుండటం గమనార్హం.

16 మందికి ఐఏఎస్ హోదా..

2022 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించి మొత్తం 16 మంది తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ అధికారులకు (రెవెన్యూ శాఖ) ఐఏఎస్ కన్‌ఫర్మ్ చేస్తూ ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 మంది అధికారులు, 2023 సంవత్సరానికి సంబంధించి ముగ్గురు, 2024కు సంబంధించి ఇద్దరు.. మొత్తం 16 మంది అధికారులకు ఐఏఎస్ హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ జాబితా రిలీజ్ అవుతుండగానే ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి.

పూర్తిగా నిబంధనలు పక్కనపెట్టి.. తమ అనుకున్నవారి జాబితాను కేంద్రానికి పంపించారని, దీనిపై కేంద్రం విచారించకుండానే జాబితాను అమోదించి.. ఐఏఎస్ హోదా ప్రకటించినట్టుగా రెవెన్యూ ఉద్యోగులే గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ల ఆశీస్సులతోనే ఇలా జరిగిందని.. అనర్హులకే అందలమెక్కించారని విమర్శలు వస్తున్నాయి.