23-01-2026 01:13:01 AM
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీ సెంటర్‌గానే ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం అనంతరం కుల సర్వే నిర్వహించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కులసర్వే చరిత్రాత్మకమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, బీసీ స్థానాల్లో గెలిచి తీరాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహేష్‌కుమార్‌గౌడ్ హాజరై మాట్లాడారు. కుల సర్వే ద్వారా బీసీలు రాష్ట్రంలో 56 శాతం ఉన్నట్లుగా తేలిందన్నారు. బీసీల కోసం చిత్తశుద్ధితో రెండు చట్టాలను తీసుకొచ్చామని, మూడు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
2029 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధత తెచ్చుకుంటామన్నారు. మిత్రపక్షమైన సీపీఐ కూడా బీసీ నేతకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని మహేష్‌కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. పీసీసీ కార్యవర్గం లో 50 శాతం బీసీలకు ప్రాధాన్యం కల్పించామని, ఉపాధ్యక్షు ల్లో 68 శాతం, జనరల్ సెక్రటరీల్లో 70 శాతం, అన్నిటికీ మించి డీసీసీ అధ్యక్ష పదవుల్లో 17 జిల్లాలకు బీసీలను నియమించి నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా డైరెక్టర్ పదవుల భర్తీ పెండింగ్‌లో ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి స్థానం ఉంటుందన్నారు.