3 May, 2026 | 1:48 AM

రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

03-05-2026 12:35 AM

సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, ఆర్టీసీ విలీనంపై చర్చకు అవకాశం

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై సమ గ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, వాటి నిర్మాణ భారం, అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు సమాచారం.

ఇటీవల వర్షాభావ పరిస్థితులు, నీటి నిర్వహణ అంశాలు ప్రభుత్వం ముందున్న సవాళ్లుగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఇక రాష్ట్ర రవాణా రంగానికి సంబంధించిన కీలక అంశమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చ జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అమలు విధానం, ఆర్థిక ప్రభావాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అధికారుల సంఘం నాయకులతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్ సమస్యలు, వేతనాలు, భత్యాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఏదైనా కీలక నిర్ణయంప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన తీపి కబురువచ్చే అవకాశముందా అనే చర్చ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఊపందుకుంది.

ఈ క్యాబినెట్ భేటీ ప్రభుత్వం తీసుకోబోయే విధాన నిర్ణయాలకు దిశానిర్దేశం చేయనుండగా, రైతులు, ఉద్యోగులు, రవాణా రంగానికి సంబం ధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల దృష్ట్యా ఈ సమావేశం ఎంతో ఆసక్తికరంగా మారింది.