సమన్వయంతోనే రోగుల భద్రతకు మరింత భరోసా
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్
పంజాగుట్ట, జూలై 11 (విజయక్రాంతి): వైద్యరంగంలో మారుతున్న సాంకేతికతను సమర్థంగా వినియోగించడంతోపాటు వైద్యులు, పరిశోధకులు, నియంత్రణ సంస్థల మ ధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటే రోగుల భద్రతను మరింత పటిష్ఠం చేయవచ్చని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహు ల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఎమర్జెన్సీ భవనంలోని ట్రామా ఆడిటోరియంలో నిర్వహించిన నిరంతర వైద్య విద్య (సీపీడీ) శాస్త్రీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘ప్రస్తుత ఫార్మాకోవిజిలెన్స్ ధోరణులు కృత్రిమ మేధస్సు, రియల్ వరల్ డేటా, రెగ్యులేటరీ అప్డేట్స్‘ అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఔష ధ భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ రోగుల భద్రతలో ఫార్మాకోవిజిలెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కృత్రి మ మేధస్సు, రియల్ వరల్ డేటా వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ఔషధాల దుష్ప్రభావాలను ముందస్తుగా గుర్తించి సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.
సీడీఎస్సీఓ జాయిం ట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాకోవిజిలెన్స్ రంగంలో అమలవుతున్న తాజా నియంత్రణ విధానాలు, నిబంధనలను వివరించారు. ఔషధ భద్రతలో నియంత్రణ వ్యవస్థల పాత్రను ఆయన విశదీకరించారు.
నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు కు హైదరాబాద్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ నరేంద్ర విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ, ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ కుమార్, వైద్యులు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, పరిశోధకులు, ఫార్మాకోవిజిలెన్స్ నిపుణులు, ఔషధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.






