2 April, 2026 | 11:42 PM

గ్రేటర్‌లో 50 శాతం దాటని పోలింగ్

15-05-2024 02:06 AM

2019 సార్వత్రిక ఎన్నికల కంటే.. 

సికింద్రాబాద్‌లో 3 శాతం, హైదరాబాద్‌లో 4 శాతం పెరిగిన ఓటింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) ః  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ నమోదు మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఓటర్లు ఇంట్లో నుంచి బయటకొచ్చి ఓటు వేసేందుకు పెద్దగా రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ ఓటర్ల తీరును తప్పు పడుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతం పెంచడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకపోవడంపై అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికలు 2019 కంటే కొద్దిగా పోలింగ్ శాతం పెరగడం కాస్త ఊరట కలిగించే అంశం. 

సికింద్రాబాద్‌లో 49 శాతం

2024 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 21,20,401 మంది ఓటర్లు ఉండగా, 10,39,879 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులో పురుషులు 5,37,166 మంది, మహిళలు 5,02,636 మంది, ఇతరులు 32 మంది ఓటు వేశారు. మొత్తం 49.04 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2,66,337 మంది ఓటర్లు ఉండగా.. 1,39,774 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

దీంతో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 52.48 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్‌లో 45.59 శాతం ఓట్లు పోలయ్యాయి. అంబర్‌పేటలో 51.65 శాతం, ఖైరతాబాద్‌లో 50.28 శాతం, సనత్ నగర్‌లో 49.45 శాతం, ముషీరాబాద్‌లో 49.09 శాతం, నాంపల్లిలో 46.59 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 19,68,147 మంది ఓటర్లకు గాను 9,10,437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో 46.26 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. దీంతో 2019 కంటే 2024లో 3 శాతం మాత్రమే పోలింగ్ పెరిగినట్టుగా గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో 48 శాతం

హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో 2024 ఎన్నికల్లో 22,17,094 మంది ఓటర్లు ఉండగా, 10,74,827 ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. అందులో 5,62,498 మంది పురుషులు, 5,12,302 మంది మహిళలు, 27 మంది ఇతరులు ఉన్నారు. ఈ మొత్తం పోలింగ్‌లో 48.48 శాతం ఓటింగ్ నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 54.72 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మలక్‌పేటలో 42.76 శాతం ఓటింగ్ నమోదైంది. కార్వాన్‌లో 51.23 శాతం, బహదూర్‌పురాలో 50.70 శాతం, చాంద్రాయణగుట్టలో 49.15 శాతం, చార్మినార్‌లో 48.53 శాతం, యాకత్‌పురాలో 43.34 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.