3 April, 2026 | 1:26 AM

ఓరుగల్లులో నెగ్గేదెవరో?

15-05-2024 02:05 AM

ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం

పార్లమెంట్ నియోజకవర్గంలో 68.86 పోలింగ్‌ శాతం

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతల ధీమా

సీఎం చరిష్మా..  కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రచారం కలిసొస్తుందని అంచనా

వరంగల్, మే 14 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి టికెట్ దక్కించుకోవడం దగ్గర్నుంచి, ఎన్నికల ప్రచారం, స్టార్ క్యాంపెయినింగ్, బహిరంగ సభలు, రోడ్ షోలు.. ఇలా ప్రధా న పార్టీల అభ్యుర్థులు అలుపు లేకుండా పనిచేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. పోలింగ్‌శాతం 68.86 నమోదైంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు ఇక గ్రామాలు, సామాజిక వర్గాలు, మతాల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? ఏ ప్రాంతంలో ఎవరికి మెజార్టీ ఓట్లు పడతాయి? అనే అంశాలపై అభ్యర్థులు తమ పార్టీ నేతలతో చర్చ నడుపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలోని పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై తమకున్న పట్టుతో ఓట్లను అంచనా వేస్తున్నారు.

జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన విధంగానే లోక్ సభ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారమూ కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుతన్నది. ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన ఓటింగ్ క్రమంగా పెరుగతూ వచ్చింది. మధ్యాహ్నం తర్వాత క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసే ముందే తతంగం జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఓట్లు ఎక్కువగా క్రాస్ అయ్యాయని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.

భద్రత కట్టుదిట్టం

పోలింగ్ తర్వాత 1,900 పోలింగ్ కేంద్రాల నుంచి అధికారులు  ఈవీఎంలను ఏనుమాముల మార్కెట్ గోడౌన్ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూంలకు వరంగల్ ఎన్నికల అధికారి ప్రావీణ్య, కేంద్ర ఎన్నికల పరిశీలకుడు బండారి స్వాగత్ రణవీర్‌చంద్ మంగళవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో తాళం వేయించారు. మధ్యా హ్నం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను వరంగల్  సీపీ అంబర్ కిషోర్‌ఝా పరిశీలించారు.