9 May, 2026 | 8:08 AM

యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

25-04-2024 02:48 AM

l పర్యావరణ, అటవీ అనుమతులిచ్చిన కేంద్రం

l నిర్మాణ పనుల్లో ఇక మరింత వేగం

l ఐదారు నెలల్లో 1600 మెగావాట్ల ఉత్పత్తి

l మొదటి విడతలో 1600 మెగావాట్లు

l రెండో విడతలో 2400 మెగావాట్లు 

l 2025 మార్చి నాటికి  పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు చేసింది. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వివిధ కారణాలతో నత్తనడకన సాగుతున్న వైటీపీఎస్‌కు పచ్చ జెండా ఊపింది. దీంతో త్వరలో 1600 మెగావాట్ల సామర్థ్యంతో మొదటి ఫేజ్‌లో (800 మెగావాట్లతో రెండు యూనిట్లు) విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం కానున్నది. దాదాపు సంవత్సరం కాలంగా ఈ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలోని వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో వైటీపీఎస్‌ను నిర్మిస్తున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. దీనికి రూ.36,500 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. ఆలస్యం అయిన కొద్దీ వ్యయం పెరుగుతుండటంతో.. కేంద్రానికి గత ప్రభుత్వం, తాజా ప్రభుత్వం కూడా అనేకమార్లు విజ్ఞప్తి చేశాయి. ఎట్టకేలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి చివరి పనులు మరింత వేగంగా సాగనున్నాయి. 

ఐదారు నెలల్లో 1600 మెగావాట్లు

కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి, మొదటి ఫేజ్‌లో 1600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జెన్‌కో సిద్ధమైంది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మెదటి ఫేజ్‌లోని 1600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జెన్‌కో పనిచేస్తోంది. అలాగే వచ్చే మార్చి నాటికి (2025) రెండో ఫేజ్‌లో మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్తు (మూడు యూనిట్లు)ను ప్రారంభించి రాష్ట్ర అవవసరాలకు ఇక్కడి విద్యుత్తును వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

దక్షిణాదిలోనే అతిపెద్దది

దక్షిణ భారతంలోనే అతి పెద్ద పవర్ ప్లాంట్ అయిన వైటీపీఎస్ మొదటి విడతలో 1600 మెగావాట్లు, రెండో విడతలో 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని ప్రణాళిక వేసి.. ఆ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టారు. అయితే మధ్యలో కరోనా కారణంగా చాలా ఆలస్యం అయ్యింది. అలాగే కొద్ది కాలం క్రితం చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్‌లో ముంబైకి చెందిన ఒక స్వచ్చంద సంస్థ వేసిన పిటిషన్ కారణంగా.. పర్యావరణ, గాలి కాలుష్యం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తదితర అంశాలపై మరోసారి అధ్యయనం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి వచ్చింది.

ఇవన్నీ పూర్తి కావడానికి మరింత ఆలస్యం అయ్యింది. దీనితో మొత్తం వ్యయం రూ. 36,500 కోట్లకు చేరింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో సివిల్ పనులన్నీ పూర్తిచేశారు. టెక్నికల్ పనులు పూర్తిచేసి, విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఒక్కటే మిగిలింది. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉండగా, బుధవారం అవి కూడా వచ్చాయి.