౩౦న ప్రధాని మోదీ రాక
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఈ నెల 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి ఆయన హాజరవుతున్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని అంధోల్ నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌లో నిర్వ హించే బీజేపీ విశాల జన సభలో ఆయన ప్రసంగించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.
అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో మోదీ సమావేశమవుతారు. దేశంలో బీజేపీ ఆవశ్యకతను వారికి ఆయన వివరిస్తారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిపై వారితో చర్చిస్తారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీలో మరింత పురోగతికి వారి సూచనలు వింటారు. మే 3న వరంగల్, భువనగిరి, నల్గొండలలో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు. మరుసటి రోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాలలోనూ ఎన్నికల సభల్లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. కాగా, నామినేషన్లకు ముందుగానే గత నెల 16న నాగర్ కర్నూలులో మోదీ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.






