బీఆర్‌ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా

25-04-2024 02:50:29 AM

l ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం..

l అప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేస్తారా?

l లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘కారు’ షెడ్డుకే..

l బీఆర్‌ఎస్, బీజేపీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు..

l రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్

నల్లగొండ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండు సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఎన్నికల తర్వాత కారు షెడ్డుకు చేరుకుంటుందుని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నల్లగొండలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  కుండూరు రఘువీర్‌రెడ్డితో కలెక్టరేట్‌లో నామినేషన్ వేయించారు.

తర్వాత పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా ఆగస్టు 15లోపు రైతురుణమాఫీ చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉంటారా..? అని సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్, బీజేపీ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందన్నారు. అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. త్వరలో రూ.700 కోట్ల నిధులతో నల్లగొండకు అవుటర్ రింగ్ రోడ్డు, రూ.280 కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్డు, సీసీ రహదారుల పనులు ప్రారంభిస్తామన్నారు.

మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆ కృషితోనే నేడు భారత్ అన్నిరంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. తన కుమారుడు, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి కి మద్దతుగా సీపీఎం, సీపీఐ కలిసి రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో దీక్ష చేపట్టారని గుర్తుచేశారు.

శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరించి విజయం సాధించామన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే, సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..బీజేపీ నిరంకుశత్వాన్ని అడ్డుకునేందుకు తమ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నదన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత రైతులను మోసం చేసిందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, పదేళ్లలో కేవలం 7.25 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. లోక్‌సభఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త రేషనకార్డులు మంజూరు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్సెల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, డిండి, నక్కలగండి ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామన్నారు.