వైన్ షాపులుగా మారిన కిరాణా దుకాణాలు
గుమ్మడిదల మున్సిపాలిటీలో ఏరులై పారుతున్న మద్యం
గుమ్మడిదల, జూన్ 18 : కిరాణా షాపుల ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. దీనివల్ల కూలీలు డబ్బులు తాగుడుకు పెట్టడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అదే క్రమంలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆయా గ్రామ వార్డులలో మద్యం ఏరులై పారుతుంది.
అయినా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని కిరాణా షాపులలో గుట్టు చప్పుడు కాకుండా మద్యాన్ని విక్రయిస్తే మరికొన్ని షాపుల వద్ద కూర్చోబెట్టి వారికి కావాల్సిన సదుపాయాలను షాపు వద్దనే సమకూరుస్తున్నారు. మందుబాబులు వైన్స్ షాపులు ఓపెన్ చేయకముందే తెల్లవారు 6 గంటల సమయం నుండే బెల్ట్ షాప్ వద్ద క్యూ కడుతున్నారు.
మందుబాబులు షాపు వద్దకు వెళ్లేటప్పుడు బుద్ధిమంతుడిలా వెళ్లి మద్యం సేవించిన తర్వాత విచక్షణ కోల్పోతున్నారు. కిరాణా షాపుల చుట్టూ ఉన్న ఇంటి వారికి, మహిళలకు, పాఠశాలకు, ట్యూషన్ కి వెళ్లాల్సిన విద్యార్థులు భయంతో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. షాపు యజమానులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారి స్వలాభాన్ని చూస్తున్నారు తప్ప ప్రజల భయాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తును వీడి బెల్టు షాపులపై తనిఖీలు చేసి వాటిని వెంటనే సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






