4 April, 2026 | 12:36 AM

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

03-04-2026 06:40 PM

– మరిమడ్లలో నూతన సబ్ స్టేషన్‌కు భూమి పూజ

కోనరావుపేట,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

వ్యవసాయ రంగ అభివృద్ధిలో విద్యుత్ కీలకమని పేర్కొంటూ, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న ఉచిత విద్యుత్ నిర్ణయం రైతు సంక్షేమానికి మైలురాయిగా నిలిచిందని, ఆ పథకం వల్ల చిన్న, సన్నకారు రైతులు లాభపడుతున్నారని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలను నివారించేందుకు కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

మరిమడ్లలో నిర్మించబడుతున్న 33/11 కేవీ ఉప కేంద్రం ద్వారా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుతుందని చెప్పారు. సాగునీటి కోసం రైతులు విద్యుత్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో పంటల సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఇళ్లకు కూడా సులభంగా విద్యుత్ మీటర్లు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

వేములవాడ నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మొత్తం 14 సబ్ స్టేషన్ల అభివృద్ధికి ఆమోదం లభించిందని వెల్లడించారు. అదనంగా రుద్రంగి వద్ద 132 కేవీ, కథలపూర్‌లో 220 కేవీ హై కెపాసిటీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.గత పాలకులు పదేళ్లలో ఒక్క సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయలేకపోయారని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగంలో విస్తృత మార్పులు తీసుకువస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.