calender_icon.png 2 February, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను నిరాశ పరుస్తున్న వేరుశెనగ ధరలు

02-02-2026 12:29:07 AM

మార్కెట్ కు భారీగా వస్తున్న వేరుశనగ

కల్వకుర్తి ఫిబ్రవరి 1 : ఎన్నడూ లేని విధంగా వేరుశెనగ ధరలు క్వింటాల్కు రూ.12 వేల పైచిలుకు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ధరలు కొద్ది రోజులకే పరిమితమ వడంతో ప్రస్తుతం రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. పంట కోతల దశలో రైతులు తమ పండించిన వేరుశెనగను మార్కెట్కు తీసుకొస్తున్న తరుణంలో ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు గత మూడు వారాలుగా భారీగా వేరుశెనగ వస్తున్నాడం వ్యాపారులు ధరలను తగ్గిస్తూ వస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం క్వింటాల్కు రూ.12,700 వరకు పలికిన వేరుశెనగ ధరలు, ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.10,000 మధ్యకే పరిమితమవుతున్నాయి.

అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం, సాగు ఖర్చులు పెరగడంతో ధరలు సహకరిస్తాయని రైతులు భావించినప్పటికీ, మార్కెట్లో దానికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆదివారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు మొత్తం 4,862 బస్తాల వేరుశెనగ రాగా, అందులో గరిష్ఠ ధర రూ.10,600, సగటు ధర రూ.9,490 మాత్రమే పలికినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత వేరుశనగ మార్కెట్ కు వచ్చే అవకాశం ఉన్నందున ధరలు ఏ స్థాయిలో ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.