నోళ్లు తెరిచిన బోర్లు..

24-04-2024 12:16:47 AM

ఎండుతున్న పైర్లు జిల్లావ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంట నష్టం

పంటను కాపాడుకునేందుకు భగీరథయత్నం

కొన్నిచోట్ల వరి, మక్క పంటలను పశువులకు వదిలేసిన రైతులు

నష్టపరిహారం అందించాలని డిమాండ్

కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన శేఖర్ అనే రైతు 

ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. 

ఇటీవల బోరు వట్టిపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో 

రైతు పంటను పశువులకు వదిలేశాడు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 50 మందికిపైగా రైతులు పంట నష్టపోతున్నారు. 

అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. 


కామారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భూగర్భజలాలు ఇంకిపోవడం, బోర్లు వట్టిపోవడం, ప్రాజెక్ట్‌ల్లో జలాలు లేకపోవడంతో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది రైతులు దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పం టలు ఎండిపోయాయి. దీంతో కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే పంటలను పశువులకు వదిలివేశారు. నర్సన్నపల్లి, కోటాల్‌పల్లి, లింగా యపల్లి, చిన్నమల్లారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇంకా కామారెడ్డి మండలంలో తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో కొందరు రైతులు ట్యాంకర్లను ఆశ్రయించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా రు. కష్టపడి, పెట్టుబడులు పెట్టి, పంట చేతికి వచ్చే సమయంలో పంట ఎండి పోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ..

పంట నష్టపోయిన వారిలో ఎక్కువమం ది చిన్న, సన్నకారు రైతులే. అందరూ ఒకటి, రెండు, ఐదెకరాలలోపు భూమి ఉన్నవారే. పంటలు ఎండిపోతుంటే వ్యవసాయశాఖ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు చూడ డం లేదని రైతులు వాపోతున్నారు. వెంటనే రాష్ట్రప్రభుత్వం స్పందించి, పంటలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


వరి ఎండిపోయింది.. వరి ఎండిపోయింది..

నేను నాకున్న రెండున్నర ఎకరా ల్లో వరి సాగు చేస్తున్నాను. బోరు ఉందనే నమ్మకంతో రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. నెల క్రితం భూగర్భజలాలు ఇంకి పోయి బోరు వట్టిపోయింది. పంట ఎండిపోయింది. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
 ద్యాప రాజు, రైతు, 

నర్సన్నపల్లి, కామారెడ్డి జిల్లామా దృష్టికి రాలేదు..

జిల్లాలో బోర్లు వట్టిపోవడంతో పంటలు ఎండిపోయినట్లు రైతులు మా దృష్టికి తీసుకరాలేదు. ఫిర్యాదు లు వస్తే ఎక్కడ బోర్లు ఎందుకు వట్టిపోయాయో, పంటలు ఎక్కడెక్కడా ఎండిపోయాయో గుర్తిస్తాం. ఏఈవోల సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిస్తాం. రైతులకు పరిహారం అం దించేందుకు కృషి చేస్తాం.

  1.  శ్రీనివాస్ రావు, కామారెడ్డిమండల వ్యవసాయ అధికారి