సన్నబియ్యం ధరలకు రెక్కలు

24-04-2024 12:19:04 AM

చుక్కలనంటుతున్న ధర

క్వింటాల్‌కు రూ.2 వేల వరకు పెంపు

మంచిర్యాల నుంచి బయటి రాష్ట్రాలకు తరలింపు 

మంచిర్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదికంటే ఈ సారి క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ. 2,000 వరకు పెంచి అమ్ముతున్నారు. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది వాన కాలం సన్నరకం ధాన్యం ఆశించిన దిగుబడి రాకపోవడం, పండిన ధాన్యాన్ని సైతం దళారులు కొనుగోలు చేసి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ (మిర్యాలగూడ) తదితర జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల ధరలు పెరుగుదలకు దారితీస్తుంది. 

చుక్కలు చూపిస్తున్న ధరలు 

బియ్యం ఉడికినా.. ఉడకకున్నా ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఏడాది జై శ్రీరాం రకం పాత బియ్యం రూ.5 వేలు ఉంటే ఈ ఏడాది రూ.6,500 వరకు పలుకుతున్నాయి. దీనితో సన్న బియ్యం పేరు చెప్తేనే సామాన్యులు, మధ్యతరగతి వారు వణికిపోతే పరిస్థితి నెలకొంది. మరోవైపు కొత్త బియ్యం, స్టీం రైస్, నూకల ధరలు పెరిగిపోతుండటంతో రోజువారీ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

సన్న బియ్యం ధరల వివరాలు ఇలా..

బియ్యం రకం        నిరుడు (క్వింటాల్‌కు) ప్రస్తుతం (క్వింటాల్‌కు)

జై శ్రీరాం (పాతవి) రూ.5,500 నుంచి రూ.6,200 రూ.6,800నుంచి రూ.7,600

జై శ్రీరాం (కొత్తవి) రూ.4,500 నుంచి రూ.5,000  రూ.5,500 నుంచి రూ.5,800

బీపీటీ (పాతవి) రూ.4,600 నుంచి రూ.5,000 రూ.5,400 నుంచి రూ.5,700

బీపీటీ (కొత్తవి) రూ.4,000 నుంచి రూ.4,200 రూ.4,500 నుంచి రూ.4,800

స్టీం రైస్ (సన్నవి) రూ.5,000 నుంచి రూ.5,200 రూ.5,500 నుంచి రూ.6,200

నూకలు రూ.1,700 నుంచి రూ.2,000 రూ.2,200 నుంచి రూ.2,500