25 July, 2026 | 2:48 AM

అక్రమాలకు అడ్డాగా హెచ్‌సీఏ: టీసీఏ

25-07-2026 02:13 AM

పారదర్శకత లేకుండా కోచ్‌ల ఎంపిక

అంబటి రాయుడుపై గురువారెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, జూలై 24: హైదరాబాద్  హైదరాబాద్ క్రికెట్ అసోసియే షన్ (హెచ్‌సీఏ) కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత కుటుంబాల ఎదుగుదల కోసం వాడుకునే అడ్డాగా మారిపోయిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది.

క్రికెటింగ్ అఫైర్స్ కోఆర్డినేటర్ అం బటి రాయుడు నేతృత్వంలో రాజ్యాంగాన్ని మరుగున పడేసి, అన్ని నిబంధనలనూ ధిక్కరిస్తున్నారని మండిపడింది. కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మ మేమిటని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి ప్రశ్నించారు. అంబటి రాయుడు అక్రమ నియామకాలకు లైసెన్స్ ఇస్తున్నారనీ ఆరోపించారు. సెలక్టర్లు తమ కొడుకులను తామే టీమ్‌లకి ఎంపిక చేసుకునేంత దారుణమైన పరిస్థితులు హెచ్‌సీఏలో దాపురించాయంటూ విమర్శించారు.

సెలక్టర్ తిమోతి రవికుమార్, తన కొడుకుని హెచ్‌సీఏ అండర్ 19 జట్టులోకి ఎంపిక చేయడానికి పక్కా ప్లాన్ వేసారన్నారు.అంబటి రాయుడు ప్రారంభించి న ఫీనిక్స్ అకాడమీ నిర్వాహకుడు శశాంక్ నాగ్‌ను ఎటువంటి పారదర్శకత లేకుండా అండర్ 19 బ్యాటింగ్ కోచ్‌గా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షత్ రెడ్డి, టి. సుమన్, మెహదీ హసన్, ఆకాష్ భండారీ  5 సంవత్సరాల కూలింగ్-ఆఫ్ నిబంధనను ఉల్లంఘించి సెలక్టర్లు, కామెంటేటర్లుగా చలామణి అవుతున్నారన్నారు. ఈ అక్రమాలపై ఎన్నిసార్లు తాము ఫిర్యాదు చేసినా సింగిల్ మెంబర్ కమిటీ పట్టించుకోవడం లేదన్నారు.