5 July, 2026 | 1:35 AM

సిటీలో ఆహార కల్తీపై హెచ్‌ఫాస్ట్ ఉక్కుపాదం

05-07-2026 12:00 AM
  1. 100 రోజుల్లో 185 కేసులు.. 
  2. 121 టన్నులకు పైగా కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం: సీపీ సజ్జనార్

బంజారాహిల్స్, జూలై 4 (విజయక్రాంతి): నగరంలో ఆహార కల్తీ ముఠాలపై హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రత్యేక విభాగం హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే కల్తీ ఆహార తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ విభాగం ఏర్పాటై వంద రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో నగరవ్యాప్తంగా 185 కేసులు నమోదు చేసి, 121.87 టన్నులకుపైగా కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.మార్చి 19న ప్రారంభమైన హెచ్-ఫాస్ట్.. జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహిస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేలా చర్యలు చేపడుతోంది.

జోన్ల వారీగా కేసులు..

వంద రోజుల వ్యవధిలో రాజేంద్రనగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. గోల్కొండలో 44, సికింద్రాబాద్లో 35, చార్మినార్లో 21, శంషాబాద్లో 13, జూబ్లీహిల్స్లో 12, ఖైరతాబాద్ జోన్లో 5 కేసులు నమోదు చేశారు.

భారీగా కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం..

దాడుల్లో 27,024 కిలోలకు పైగా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 25,845 కిలోల రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు, 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 9,260 కిలోల నిల్వ పచ్చళ్లు, 4,030 కిలోల కల్తీ కోవా, 3,897 కిలోల నకిలీ టీ పొడి, 15 టన్నుల నాణ్యతలేని చికెన్, మాంసం, 3,260 కిలోల కల్తీ క్రీమ్, 530 కిలోల నెయ్యి, 2,706 కిలోల నాసిరకం డ్రైఫ్రూట్స్, 2,500 కిలోల కల్తీ పెరుగు, 1,514 కిలోల పనీర్, 120 కిలోల నాణ్యతలేని ఫ్రైడ్ చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఐస్క్రీములు, బిస్కెట్లు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్ తయారీ కేంద్రాలపై కూడా పలు కేసులు నమోదు చేశారు.

247 కేసులు ఫుడ్ సేఫ్టీ శాఖకు..

తదుపరి చర్యల కోసం 247 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు బదిలీ చేశారు. వీటిలో పనీర్ విక్రయ కేంద్రాలపై 70, ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90, సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్లాంట్లపై 9, మసాలా ఉత్పత్తులపై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4, ఐస్ తయారీ కేంద్రాలు, చికెన్ వ్యర్థాలు, సీఫుడ్కు సంబంధించిన కేసులు ఉన్నాయి.

వ్యాపారులకు హెచ్చరిక

ఆహార తయారీ, విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని, సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించాలని, నిల్వల్లో ’ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్ ’ విధానం అమలు చేయాలని, వాడిన నూనెను పదేపదే వినియోగించరాదని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇతర ఆహార వ్యాపార సంస్థలకు అధికారులు స్పష్టం చేశారు.

పీడీ యాక్ట్ ప్రయోగించడానికీ వెనుకాడం: సీపీ సజ్జనార్

ఆహార కల్తీని సాధారణ నేరంగా కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.హెచ్-ఫాస్ట్ ఏర్పాటైన తక్కువ కాలంలోనే విశేష ఫలితాలు సాధించిందని ఆయన అభినందించారు.

నగరంలో ప్రతి రోజు సగటున 15 వరకు ఫిర్యాదులు ప్రజల నుంచి అందుతున్నాయని తెలిపారు. ఆహార కల్తీపై సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా హెచ్-ఫాస్ట్ వాట్సాప్/ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు. సురక్షితమైన, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.