సగం సగం పనులు
అవస్థలు పడుతున్న ప్రజలు
కేసముద్రం, మార్చి 20 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు సగం సగం చేస్తున్నారని, దీనితో రాకపోకలకు, వాణిజ్య, వ్యాపార వర్గాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, మహాత్మ జ్యోతిబాపూలే సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు మూడు రోడ్లను డబుల్ రోడ్డుగా విస్తరించి, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. అలాగే బైపాస్ రోడ్డును కూడా విస్తరించే పనులు చేపట్టారు.
వీటికి తోడు పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఉప్పరపల్లి చౌరస్తా చిన్న బడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో జ్యోతిబాపూలే సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు మాత్రమే రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు సక్రమంగా సాగడం లేదు. విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే కొన్నిచోట్ల రోడ్డు వేయడం, డబల్ రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇచ్చినప్పటికీ అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించకుండా, రోడ్డు విస్తరించకుండానే దారి మధ్యలో డివైడర్ ఆగమేగాల మీద నిర్మించారు.
దీనివల్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారింది. అలాగే విద్యుత్ స్తంభాలను కూడా పూర్తిస్థాయిలో వెనక్కి జరిపి వేయకుండా అర్ధాంతరంగా మార్కెట్ వద్ద పనులను వదిలేశారు. ఇక మార్కెట్ రెండు గేటు వద్ద కల్వర్టు నిర్మాణం కోసం పైపులు తీసుకువచ్చి రోడ్డుపైన వేసి, నిర్మాణ పనులను చేపట్టకుండా వదిలేశారు. దీనితో రోడ్డుపైన పైపులు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. అలాగే రోడ్డు నిర్మాణ పనుల్లో కొన్నిచోట్ల మెకడం వేసి, మరి కొన్నిచోట్ల మట్టితో నిర్మాణ పనులను వదిలేశారు.
రోడ్డు విస్తరణ కోసం మొదట్లో ఉరుకులు పరుగుల మీద ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా తొలగించారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడం, కొత్తగా డ్రైనేజీ నిర్మాణం ఊసే లేకపోవడంతో మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తూ కేసముద్రం పట్టణంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. రోడ్ల విస్తరణ పనులను చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు రోడ్ల విస్తరణకు కొన్నిచోట్ల అడ్డుగా నిర్మాణాలు ఉన్నాయని, అలాగే మరికొన్ని చోట్ల నిర్మాణాల తొలగింపు ఆటంకం కలుగుతోందని, దీనివల్ల పనులు వేగవంతంగా చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు.
అయితే ఏదేమైనా ముందుగా పనులు చేపట్టే ముందే బిట్లుగా చేసి, ఎక్కడికక్కడే పనులు పూర్తి చేసిన తర్వాత డివైడర్ నిర్మించి, రోడ్డుపై ఫైనల్ బీటీ వేస్తే బాగుండేదని, అలా కాకుండా ఏకబిగిన పనులు చేపట్టి పనులను మధ్యలో వదిలేయడం సరైంది కాదనే విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవికాలంలో పనులు త్వరితగతిన పూర్తి చేయకపోతే వర్షాకాలంలో పట్టణ ప్రజలకు రోడ్ల విస్తరణ పనుల వల్ల మరింత ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి.




