విద్యకు సరైన చదివింపేది!
బడ్జెట్‌లో రూ.26,674 కోట్లే
15 శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చి 8.22 శాతానికే పరిమితం
గతేడాది రూ.23,108 కోట్లే..
ఓయూకు రూ.వెయ్యి కోట్లు, ఐలమ్మ ఉమెన్స్ వర్సిటీకి రూ.400 కోట్లు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ వాహనాలు
ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం
ఉద్యోగుల హెల్త్ స్కీంకు రూ.1056 కోట్లు
ఈ కేటాయింపులు సరిపోవంటున్న టీచర్, విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): “పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చుకాదు.. అవి పెట్టుబడులు. అమ్మకలలు, పిల్లల చదువు తెలంగాణ భవిష్యత్తు” అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026 బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం పేరుకే అన్నట్లుగా విద్యకు కేటాయింపులున్నాయి. గతేడాది బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో కాస్త నిధులు పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లలో విద్యారంగానికి తక్కువగానే కేటాయింపులు జరిగాయి.
2025 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.23,108 కోట్లు (7.57 శాతం) కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.26,674 కోట్లు అంటే 8.22 శాతం కేటాయించారు. గతంలో కంటే 0.65 శాతం కేటాయింపులు పెరిగినా.. విద్యకు ఇది చాలా తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులను కేటాయిస్తామని చెప్పిన దానికంటే ఇవి చాలా తక్కువే.
సెకండరీ విద్యకు గత బడ్జెట్‌లో రూ.16,298 కోట్లు కేటాయించగా, స్కీమ్స్‌కు రూ.3,166 కోట్లు కేటాయిం చగా, ఈ బడ్జెట్‌లో రూ.16,458 కోట్లు, స్కీమ్స్‌కు రూ.4,773 కోట్లు కేటాయించారు. రూ.16,298 కోట్లలో మొత్తం జీతభత్యాలకే పోతాయి. గత బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.3009 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.3,263 కోట్లను పరిపాలన నిర్వహణ, జీతభత్యాలకు పోగా, స్కీమ్స్‌కు రూ.2,180 కోట్లు కేటాయించారు.
ఉస్మానియాకు రూ.వెయ్యి కోట్లు
ఉస్మానియా వర్సిటీకు సీఎం ప్రకటించినట్లుగా రూ.వెయ్యి కోట్లు, మహిళా వర్సిటీకి రూ.400 కోట్లను కేటాయించింది. కానీ మిగిలిన వర్సిటీలకు ఎంత నిధులను కేటాయించిందో బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు.
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
పాఠశాల పరిధిలోని స్కూళ్లలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ఈ విద్యాసం వత్సరం (2026 నుంచే ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రీ నుంచి ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన పోషకాలు అందించేలా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు అందించే బ్రేక్ ఫాస్ట్‌లో వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావను అందిస్తారు. ఈ బడ్జెట్‌లో అన్ని వసతి గృహాలు, గురుకులాల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకర ణకు రూ.100 కోట్లు ప్రతిపాదించారు.
సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీం
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోసం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గానూ ప్రభు త్వం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెం ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. యూఏ ఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5వేల కోట్లు
105 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.5 వేల కోట్లను కేటాయించింది. ఇక ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దనున్నారు. వీటిలో ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులతో విద్యనందించనున్నారు.
జాబ్ క్యాలెండర్, హామీల ఊసేలేదు?
కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాకార్డు, విద్యార్థినులకు స్కూటీలు, యూత్ కమిషన్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, గత రెండు బడ్జెట్‌లలో ఈ హామీల ప్రస్తావనే లేదు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణపై చట్టం రూపకల్పన గురించి ప్రకటన కనిపించనేలేదు.
పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావనేదీ?
పీఆర్సీ అమలు, రావాల్సిన పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ఒకవైపు పెండింగ్ డీఏలు నాలుగు, పీఆర్సీ అమలు 33 నెలలుగా ఆలస్యమైంది. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఈహెచ్‌ఎస్ స్కీంలో భాగం గా డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. రూ.1,056 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, వారి కుంటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
ఈహెచ్‌ఎస్ కేటాయింపులు హర్షణీయం: ఎస్టీయూటీఎస్
విద్యాశాఖకు ఈ బడ్జెట్‌లో నామమాత్రపు నిధులే కేటాయించారని, అయితే ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్‌ఎస్ స్కీంను ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఎస్టీయూ టీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు జి.సదానందం గౌడ్, జుట్లు గజేందర్ తెలిపారు.
15 శాతం నిధులు కేటాయించాలి: టీఆర్టీఎఫ్
కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లుగా ఈ బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులను కేటాయిం చకుండా 8.22 శాతమ మాత్రమే కేటాయించిందని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ తెలిపారు. అరకొర నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్వహణ అసాధ్యమన్నారు.
జనాకర్షణే..: టీఎస్ యూటీఎఫ్
బడ్జెట్‌లో జనాకర్షణే తప్ప వాస్తవికత లేదని టీఎస్ యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, వెంకట్ తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్‌లోనూ విద్యకు 15 శాతం నిధులు కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావించలేదు.
ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలు
సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఇంటర్ విద్యా జేఏసీ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం పాలాభిషేకం చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నందుకు గానూ సీఎంకు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.పి.మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 430 ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలు చేపడుతున్న సీఎంకు ఆయనతోపాటు నాయకులు కళింగ కృష్ణ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
డా.పి.ముధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్





