రాబడిలో సగం అప్పులు, జీతాలకే
53 శాతం వాటికే పోతోంది
2023-24 బడ్జెట్‌లో వాస్తవాలు, అంచనాల్లో భారీ తేడా
రెవెన్యూ ఆదాయం 78 శాతం, వ్యయం 79 శాతం
అంచనాలకు అందేలా ఫుల్ బడ్జెట్ ఉంటుందా?
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2023-24 బడ్జెట్‌లో వాస్తవాలు, అంచనాల మధ్య భారీ తేడా ఉంది. దీంతో ఈ పద్దు ఎలా ఉంటుందనే విష యం చర్చనీయాంశంగా మారింది. గత బడ్జెట్‌లో వచ్చిన రాబడిలో 53 శాతం అప్పు లు, జీతాలకే ఖర్చు చేసిన పరిస్థితి నెలకొంది. గతేడాది చేసిన రెవెన్యూ వ్యయం అంచనాలో 79.16 శాతం మాత్రమే జరిగింది. ఇందులో 28 శాతం జీతాలు, 13 శాతం పెన్షన్లు, 12 శాతం వడ్డీలకే సరిపోయింది. ఈ క్రమంలో ఫుల్ బడ్జెట్‌లోనూ రాబడిలో సగానికిపైగా వీటికే కేటాయిస్తే సంక్షేమం, అభివృద్ధి సంగతేంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ప్రభుత్వం తమ బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయాన్ని రూ.2.16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. వచ్చిన వాస్తవ ఆదాయం రూ.1.69లక్ష కోట్లు మాత్రమే కావడం గమనార్హం. పరిమితికి మించిన అప్పులు చేసినా రాబడి అంచనాలను అందుకోలేకపోయింది. వాస్తవానికి 2023 బడ్జెట్‌లో అప్పులకు రూ.38,234.94 కోట్లుగా అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.49,589.29 కోట్లు అయ్యాయి.
భారీగా నిధులు అవసరం
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు దాదాపు రూ.70వేల కోట్లకుపైగా కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో కేటాయింపులు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవికతకు దగ్గరగా పద్దును తయారుచేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఆదాయాన్ని పెంచుకుంటామన్న ధీమాతో ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రెవెన్యూను పెంచుకునేందుకు ఆయా శాఖల్లో సంస్కరణలు తీసుకొస్తోంది. నెలవారీగా టార్గెట్లను నిర్ణయించింది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఆదాయానికి కీలకమివే..
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్ర జీఎస్టీ ద్వారా 43 శాతం, సేల్స్ ట్యాక్స్ ద్వారా 22 శాతం, ఎక్సైజ్ డ్యూటీతో 13 శాతం, స్టాంప్ డ్యూటీతో 12 శాతం, వాహనాలపై పన్ను ద్వారా 5 శాతం, ఎలక్ట్రిసిటీ ట్యాక్సులు, డ్యూటీస్ ద్వారా 3 శాతం రాబడి వస్తుంది. రాష్ట్రానికి ఇవే ప్రధాన ఆదాయ వనరులు. అయితే ఇందులో ఉచిత విద్యుత్ పథకం అమలు నేపథ్యంలో ఆ రాబడి తగ్గనుంది. దీన్ని భర్తీ చేసేందుకు మిగత విభాగాల్లో రాబడిని పెంచేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగూణంగానే ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.






