22 June, 2026 | 2:20 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

పర్యాటకంపై ప్రత్యేక దృష్టి

21-07-2024 12:16 AM

ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళికలు చేయండి

క్రీడా మైదానాలు ఖాళీగా ఉండొద్దు

అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో దట్టమైన అడవులు, జలపాతాలు ఉన్నాయని, వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలన్నారు. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని, దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

శనివారం సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖలకు సంబంధించిన బడ్జెట్  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి కళాకారులు గత ఏడు నెలలుగా ఏ విధులు నిర్వహిస్తున్నారనే దానిపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. కళాకారుల సేవలు వినియోగించుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో వదిలేసిందని, వాటిలో 90శాతం పనులు జరిగిన భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మిగిలిన భవనాలను దశలవారీగా పూర్తి చేయాలన్నారు. రాష్ర్టంలో పెద్దసంఖ్యలో క్రీడామైదానాలు ఉన్నాయని, వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిపారు. అవి ఖాళీ ఉండకుండా నిత్యం ఆటలు కొనసాగేలా చూడాలన్నారు. కొన్ని చోట్ల క్రీడామైదానాలు ఆక్రమణలకు గురైనట్టుగా తెలిసిందని, వెంటనే ఆ విషయాలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఆదేశించారు. పర్యాటక శాఖ సొంత, లీజ్‌లో ఉన్న ఆస్తుల వివరాలపై ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. 

కళాకారుల సేవలను వినియోగించాలి: మంత్రి జూపల్లి 

జీవన విధానంపై ప్రజలను చైతన్యపర్చేందుకు కళాకారుల సేవలను వినియోగించాలని జూపల్లి సూచించారు. రాష్ర్టంలో ఉన్న చెక్‌పోస్ట్‌లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు సమగ్ర ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో సంస్కృతి, వారసత్వ సంపదలను వినియోగించుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు దృష్టి సారించాలన్నారు.