15 June, 2026 | 2:58 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా..?

19-08-2024 12:04 PM

హైదరాబాద్: ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిం చడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసు యాక్ట్ (30 Act) పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని  పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదన్నారు.

ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి  గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నడు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఆరోపించారు.

నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.  అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బిఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.