ఉద్యోగాలివ్వడం హరీశ్‌రావుకు ఇష్టం లేదా?
- కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై రూ.40వేల కోట్ల భారం
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ యువత జీవితాలతో ఆడుకున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడం బీఆర్‌ఎస్ పార్టీకి, హరీష్‌రావుకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ పరీక్ష నిర్వహించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై రూ.40 వేల కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు. కమిషన్ కోసం కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంటు పెట్టాలని, కానీ దామరచర్లలో ఎందుకు పవర్ ప్లాంట్ పెట్టారో అర్థం కావడం లేదన్నారు. విద్యుత్ శాఖలో అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందనే హరీష్‌రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టి ఇప్పుడు పనులు చేయండి అంటే ఎలా? అని విమర్శించారు. తమ పార్టీ ఇచ్చి న హామీలన్నింటిని అమలు చేస్తామని, తమ కు ఐదేళ్ల సమయం ఉందని పేర్కొన్నారు.
జగదీష్‌రెడ్డి కోరితేనే పవర్‌పై కమిషన్ : వినోద్‌రెడ్డి
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలు ప్రజలందరికి తెలియాలనే సీఎం రేవంత్‌రెడ్డి పవర్ కమిషన్ వేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. మం గళవారం ఆయన గాంధీభవన్‌లో కాంగ్రెస్ లీగల్‌సెల్ జాతీయ కోఆర్డినేటర్ దామోదర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మా ర్వా పవర్ ప్లాంట్ వర్క్ కంప్లీట్ కాకుండా ఎందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ 15 పేజీల లేఖ ఇచ్చారని, అయితే పవర్‌పై కమిషన్ వేయాలని అసెంబ్లీలో కోరింది బీఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డేనని వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పవర్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసు ఇవ్వలేదని, వివరణ ఇవ్వాలని మాత్రమే అడిగిం దని లీగల్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ దామోదర్‌రెడ్డి అన్నారు.






