22Aపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్: 22A జాబితాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ(Harish Rao letter to Rahul Gandhi) రాశారు. తెలంగాణలో తీవ్రమైన పాలనా సంక్షోభం నెలకొందని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని(Minister Ponguleti Srinivasa Reddy) తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 22A పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A నుంచి తీయడానికి 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. యాదాద్రిలో 40 వేల ఎకరాలు 22Aలో పెట్టారని తెలిపారు. ఓఆర్ఆర్(Outer Ring Road) చుట్టూ భూములపై వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. 22A భూములపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో(Retired High Court Judge) విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 30 శాతం కమిషన్లు వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలని కోరారు. 22A జాబితాను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
''అక్రమ రిజిస్ట్రేషన్ల నుండి రక్షించడానికి ఉద్దేశించిన సెక్షన్ 22Aను, ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా స్తంభింపజేయడానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనితో పాటు "30% వసూళ్ల దందా", బినామీ సంస్థలతో బలవంతపు 50:50 అభివృద్ధి ఒప్పందాలు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హెచ్‌ఎండిఏ/జిహెచ్‌ఎంసి ఆమోదిత లేఅవుట్‌లు, దీర్ఘకాలంగా ఉన్న పట్టా భూములతో సహా వేలాది ఆస్తులు ప్రభావితమయ్యాయని సమాచారం. భూ భారతి అనేది భూ రికార్డులకు నిశ్చయతను తీసుకువస్తామని కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం. ఇది స్థిరపడిన ఆస్తి హక్కు పత్రాలకు అనిశ్చయతకు మూలం కాకూడదు.'' అని హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు చేశారు.
రాహుల్ గాంధీకి హరీశ్ రావు డిమాండ్లు ఇవే
• రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే తొలగించాలి
• పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర న్యాయ విచారణ జరపాలి
• డిసెంబర్ 2023 నుండి సెక్షన్ 22A కింద జరిగిన అన్ని చేర్పులు/తొలగింపులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి
• స్వతంత్ర అవినీతి నిరోధక విచారణ జరపాలి
• నిజమైన ఆస్తి యజమానులకు రక్షణ కల్పించాలి
• జిల్లా వారీగా, సర్వే నంబర్ల వారీగా వివరాలను బహిరంగంగా వెల్లడించాలి.






