పొలంలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి
ఆవంచ గ్రామంలో విషాదం... రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి
నర్సాపూర్, ఆగస్టు 20 : రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన తుల్జారాంపేట్ తండా పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆవంచ గ్రామానికి చెందిన చంద్రం వయసు 45 సంవత్సరాలు (సుమారు 25 ఏళ్ల కింద ఆవంచ గ్రామానికి ఇల్లరికం అల్లుడిగా వచ్చి జీవనం కొనసాగిస్తున్నాడు) తన భార్య కిష్టమ్మతో కలిసి మామ చిగురీ అయిలయ్య కు చెందిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు రాజు ఉన్నాడు.
ఈ నెల 18వ తేదీ సాయంత్రం నుంచి చంద్రం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలో 20వ తేదీ ఉదయం తుల్జారాంపేట్ తండా పరిధిలోని పొలంలో చింతచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో చంద్రం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలను పరిశీలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. చంద్రం మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.






