20 August, 2026 | 10:11 AM

ఎడపల్లి సింగిల్ విండోలో లక్షల నిధులు దుర్వినియోగం!

20-08-2026 09:36 AM

రికవరీ కోసం డీసీఓకు వినతి.. ముగ్గురు సేల్స్‌మెన్లపై ఆరోపణలు

బోధన్,ఆగస్టు 20(విజయక్రాంతి): ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( Single Window)లో రూ.30.68 లక్షల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు వెలుగులోకి రావడం మండలవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన వార్షిక ఆడిట్‌లో లెక్కల్లో భారీగా తేడాలు గుర్తించడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. పీఏసీఎస్ కార్యదర్శి(PACS Secretary) రాజారామును వివరణ కోరగా, నిధుల దుర్వినియోగం జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. సేల్స్‌మెన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్ గౌడ్, బాలరాజు, జగన్‌పై ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం ప్రభాకర్ గౌడ్‌పై రూ.25 లక్షలు, బాలరాజుపై రూ.3.50 లక్షలు, జగన్‌పై రూ.2.18 లక్షల మేర నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. దీంతో మొత్తం రూ.30.68 లక్షలకు చేరింది.

ఎరువుల విక్రయాల సొమ్ము పక్కదారి

సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు విక్రయించే సేల్స్‌మెన్లు, విక్రయాల ద్వారా వచ్చిన నగదును సంఘం ఖాతాలో జమ చేయకుండా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కొంతకాలంగా కొనసాగినప్పటికీ ఇటీవల జరిగిన ఆడిట్‌లో లెక్కల పరిశీలన సందర్భంగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

పర్యవేక్షణపై ప్రశ్నలు

ఏళ్ల తరబడి లక్షల రూపాయల నగదు సంఘం ఖాతాలో జమ కాకపోవడంపై పర్యవేక్షణ అధికారులు ఏం చేశారనే ప్రశ్నలు రైతులు, సంఘం సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. రైతులకు అండగా నిలవాల్సిన సహకార సంఘాల్లో ఇలాంటి ఆర్థిక అవకతవకలు చోటుచేసుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రికవరీతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారినుంచి సొమ్మును రికవరీ చేయాలని కోరుతూ సింగిల్ విండో చైర్మన్ పోలమల్కా రెడ్డి, కార్యదర్శి రాజారాం మంగళవారం డీసీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. కేవలం నిధుల రికవరీతో సరిపెట్టకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఉద్యోగపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. అధికారిక విచారణ పూర్తయితే నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.