ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?
హైదరాబాద్: మల్కాజ్ గిరి పరిధిలోని వాజ్పేయినగర్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం పర్యటించారు. 22ఏ నిషేధిత జాబితా భూ బాధితులతో ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశం నిర్వహించారు. 22ఏ వల్ల రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలతో, మేడ్చల్ జిల్లాలో 6,000 జీవోలతో లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆగం చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని, మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రి భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామంటున్నారని, ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష? అని హరీష్ రావు అడిగారు. లక్షలాది అపార్ట్మెంట్లు, ఇళ్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వమే వాటిని వెంటనే తొలగించాలని హరీష్ రావు హెచ్చరించారు.
దొంగతనం చేసిన దొంగ దొరికిపోయాక "సారీ" చెబితే చేసిన నేరం మాఫీ అయిపోతుందా?, పొంగులేటి చేసిన ఉద్దేశపూర్వక తప్పుకు లక్షల మంది ప్రజలు ఆగమయ్యారు. ప్రజల ఆస్తులపై నువ్వు ఇష్టమొచ్చినట్లు పెత్తనం చేస్తే నిన్ను, నీ ప్రభుత్వాన్ని ఆ ప్రజలే పాతరేస్తరు రేవంత్ అని దుయ్యబట్టారు. 22ఏ నిషేధిత భూముల బాధితులారా అధైర్యపడొద్దు, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సమస్యపై మీ తరఫున మేము పోరాడతామని, అసెంబ్లీని స్తంభింపజేసైనా కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతామన్నారు.






