13-08-2025 02:03:04 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా నోరు మెదపడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ వద్ద ఎరువుల(Fertilizer shortage) కోసం క్యూలో రైతులున్నారు. ఎరువుల కోసం బారులు తీరిన రైతులను చూసిన హరీశ్ రావు ఆగి వారితో మాట్లాడారు. గంటల తరబడి వేచి చూస్తే ఒకట్రెండు బస్తాలే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీ వెళ్లినా ఎరువుల కొరత తీర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందని హరీశ్ రావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీపీ, ఒక బస్తా విధానం తీసేయాలని డిమాండ్ చేశారు.
రైతుల అవసరాల అనుగుణంగా ఎరువుల బస్తాలివ్వాలని హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృతిమ ఎరువులను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్ కు ఎరువులు తరలిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని.. మీరు నీళ్లు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం యూరియా ఇస్తలేదు, మేం పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు పంట పండాలి అంటూ రైతులు ఆందోళన చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఎట్లా రావని రైతులు సూటిగా అడుగుతున్నారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడని అగ్రికల్చర్ అధికారులపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. పదేళ్లల్లో లేని యూరియా కొరత ఇప్పుడు వచ్చింది ఇది ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమని మండిపడ్డారు.