అబద్ధాలకోరు హరీష్ రావు
నోరు అదుపులో పెట్టుకోండి
విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా హరీష్ రావు అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలు కల్లబొల్లి అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతల అసత్య ప్రచారాలపై ధ్వజమెత్తారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చి కూడా రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులను డిఫాల్టర్లుగా మార్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతన్నల పక్షాన నిలబడిందని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రికార్డు..
కేంద్రం 51 లక్షల టన్నుల కొనుగోలుకు అనుమతిస్తే, ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 70 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం అనుమతి లేకపోయినా రూ. 3,500 కోట్లు కేటాయించి రైతుల నుండి మొక్కజొన్నను కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని,
కటింగ్ లేని కొనుగోళ్లు..
గత బీఆర్‌ఎస్ పాలనలో రైతుల ధాన్యంలో క్వింటాలుకు 10 కిలోల వరకు కోత విధించి రైతుల నడ్డి విరిచారు. కానీ నేడు మా ప్రభుత్వంలో ఒక్క గింజ కటింగ్ లేకుండా, కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారని, కేసీఆర్, హరీష్ రావు కలిసి లక్షల కోట్లు వృథా చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ’కూలేశ్వరం’గా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, జూరాల వంటి ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనని,
నిజాలు తెలుసుకోండి..
కొనుగోలు కేంద్రాలను మంత్రులు సందర్శించడం లేదని ఆరోపించడం హాస్యాస్పదమని, స్వయంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పెద్దకలవల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇవన్నీ బీఆర్‌ఎస్ నాయకులకు కనబడటం లేదా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇకనైనా అబద్ధాలు మానుకుని, హుందాగా వ్యవహరించాలని, అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని విజయరమణ రావు సూచించారు.
నూటికి నూరు శాతం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






